
ఏపీ సీఎం జగన్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మధ్య అదో రకమైన వైరి నడుస్తుంది. దీనిలో భాగంగానే ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ఈ పిటిషన్ లో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు లేకపోవడంతో పాటు సాంకేతిక తప్పులే కారణంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తిరస్కరించే సమయంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి.. మళ్లీ పిటిషన్లను దాఖలు చేస్తామని రఘురామరాజు తెలిపారు. జగన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామరాజు.. గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఏడాది పాటు విచారణ జరిపిన అనంతరం.. ఈ పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రఘురామరాజు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్, విజయసాయిరెడ్డి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసులో సీబీఐ కోర్టు తన వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని రఘురామరాజు తాజా పిటిషన్లలో పేర్కొన్నారు. ఏ1, ఏ2లు అధికారంలో ఉన్నారని, సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసుల్లో ఉన్న తమ సహ నిందితులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిందితులిద్దరూ బెయిల్ షరతులను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా.. సీబీఐ పట్టించుకోవడంలేదని, ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయడం లేదని రఘురామరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.