
అవాంఛిత సంతానమో.. మరేదైనా కారణమో గానీ.. పురిటి బిడ్డలను వదిలించుకునేందుకు సిద్ధపడుతున్న తల్లుల సంఖ్య పెరుగుతోంది. అమ్మ వెచ్చటి ఒడిలో సేదదీరుతూ.. అల్లారుముద్దుగా పెరగాల్సిన బిడ్డలు కాస్తా చెత్త కుప్పల్లోకి చేరుతున్నారు. అక్కడ వాళ్లను గుర్తించడం కాస్తంత ఆలస్యమైనా.. అమ్మ పాల కోసం ఆకలితో ఏడ్చి ఏడ్చి.. కొందరు అక్కడే దయనీయమైన స్థితిలో కన్నుమూస్తుండగా.. మరికొందరు మాత్రం అనాథ శరణాలయాల్లో పెరుగుతున్నారు. ఇలాంటి స్థితి భవిష్యత్తులో ఏ చంటి బిడ్డకూ రాకూడదని సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు.
‘‘మీకు పుట్టిన పిల్లలను వదిలించుకోవాలనుకుంటే.. చెత్త కుప్పల్లో పడేయకండి. ఈ ఊయల్లో వదిలేయండి’’ అని పిలుపునిస్తున్నారు. ఈ దిశగా తమ కార్యాలయం వద్ద ఓ ఊయలను ఉంచారు. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలూ ఉండవని, మీరెవరో తెలిసే అవకాశమే ఉండదని భరోసా ఇస్తున్నారు. శిశువులను అక్కడ వదిలిపెడితే తెలిసిపోతుందేమన్న ఆందోళన అక్కర్లేదని చెబుతున్నారు. ‘‘పసిబిడ్డలను చెత్తకుప్పల్లో, మురుగు కాల్వల వద్ద పడేయడం వల్ల వారికి గాయాలవుతున్నాయి. వారిని గుర్తించి, ఆస్పత్రుల్లో చేర్పించినా అప్పటికే ఆలస్యమై చనిపోతున్నారు. ఇలాంటి పసిబిడ్డలను సంరక్షించేందుకే ఈ ఏర్పాటు చేశాం’’ అని అధికారులు చెబుతున్నారు. అలా వచ్చిన పిల్లల పెంపకం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, వారికి ఏ లోటూ లేకుండా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తామని అంటున్నారు. ఆ శాఖ జిల్లా అధికారి పద్మావతి, బాలిక సంరక్షణ అధికారి రత్నం, సేవ్ ద గర్ల్ చైల్డ్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ చక్రపాణి, డాక్టర్ శంకర్ బాబు, ప్రిన్సిపాల్ కళింగ కృష్ణకుమార్, జైలర్ శివకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, మైత్రీ ఫౌండేషన్ నిర్వాహకుడు ఉదయ్ కుమార్ సహకారంతో ఈ ఊయలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు శిశువులకు ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ ప్రతినిధులు నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఇలాంటి ఊయలలను త్వరలో జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రుల ఆవరణలోనూ ఏర్పాటు చేస్తామని బాలికా సంరక్షణ అధికారి రత్నం తెలిపారు.