
మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ఉమ్మక్క జైల్లో చిప్పకూడు తింటుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదల ఇంటి నిర్మాణం కోసం జగనన్న ప్రభుత్వం స్థలాలు సేకరిస్తుంటే, ల్యాండ్ మాఫియా అని తెలుగుదేశం పార్టీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాగే ఈరోజు అక్కడ మహిళలు ఇళ్లు కట్టుకుంటుంటే, అక్కడ ఎవరూ ఇళ్లు కట్టుకోవడం లేదని, కేవలం మైనింగ్ మాత్రమే జరుగుతుందని దేవినేని ఉమక్క అక్కడకు వెళ్లి తెగ హడావుడి చేసి జైలు పాలయ్యాడని రోజా విమర్శించారు. సీఎం జగన్ చేస్తున్న డెవలప్మెంట్ చూసి సహించలేని టీడీపీ నేతలు కడుపు మంటతో ఇలాంటి పనులు చేస్తున్నారని, దేవినేని ఉమాలాంటి వారు అక్కడకు వెళ్లి వైసీపీ నేతలపై రాళ్లు వేయడం, కర్రలతో కొట్టి భయభ్రాంతులకు గురి చేయడం ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఉమ ఈరోజున జైలుకు వెళ్లి చిప్పకూడు తినే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే రోజా ఘాటువ్యాఖ్యలు చేశారు.