
గోవిందా.. గోవింద..! ఏకంగా ఏడుకొండల వాడి సొమ్ములపైనే జగనన్న గురిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులు సమర్పిస్తున్న కానుకలనే కాజేసేందుకు యత్నిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రజలను పన్నులతో బాదేసింది. అదీ చాలక.. ఇప్పుడు ఆపదమొక్కుల వాడి ఆదాయంపై కన్నేసింది. టీటీడీ నుంచి భారీగా నిధులు రాబట్టాలని నిర్ణయించింది. టీటీడీ నుంచి ఇప్పటివరకు ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇక నుంచి ఏటా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం అంటూ బడ్జెట్లో రూ.234 కోట్లను కేటాయించింది. ఆలయాల కోసం నేరుగా ప్రభుత్వ నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అంటూ భారీఎత్తున ప్రచారం చేసుకుంది.
ప్రభుత్వం.. ఈ కేటాయింపులు చూపించి ఏడాది దాటింది. కానీ, ఆ నిధులను మాత్రం విడుదల చేయలేదు. అనంతరం రెండు బడ్జెట్లలో అసలు కేటాయింపులే లేవు. ఇప్పుడేమో ఏకంగా టీటీడీ నుంచే నిధులు రాబట్టేందుకు యత్నిస్తోంది. అది కూడా హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చేయాలని చూస్తోంది. ఇందకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసేసింది. అసెంబ్లీలో బిల్లు పెట్టేవరకూ కూడా ఈ ప్రభుత్వం ఆగలేకపోతోంది. ఈ క్రమంలో.. పక్కా ప్రణాళికా బద్ధంగా అడుగులేస్తోంది. ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఉపయోగించే కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు ఏటా రూ.40 కోట్లు, ఉద్యోగుల వేతనాలకు ఉద్దేశించిన ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ (ఈఏఎఫ్)కు రూ.5 కోట్లు, అర్చక వెల్ఫేర్ ఫండ్ కు రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.50 కోట్లు ఇవ్వాలనే విధంగా దేవాదాయశాఖ చట్టంలో నిబంధనలను సవరించనుంది. అసెంబ్లీ సమావేశాలు లేనందున.. దీనిపై ఆర్డినెన్స్ తీసుకురానుంది. దీని ప్రకారం దేవాదాయశాఖ తన పరిధిలోని ఆలయాల నుంచి వివిధ కాంపోనెంట్ల కింద వాటా వసూలు చేస్తుంది.
సాధారణంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ఆదాయం నుంచి 9 శాతం సీజీఎఫ్, 8 శాతం ఈఏఎఫ్, 3 శాతం అర్చక వెల్ఫేర్ ఫండ్‌కు తీసుకుంటుంది. ప్రతిఏటా ఆలయాలు వాటి ఆదాయాన్ని అంచనా వేశాక దేవదాయశాఖకు ఈ నిధులు అందిస్తాయి. అన్ని ఆలయాల తరహాలోనే టీటీడీ కూడా వాటా ఇవ్వాలని దేవాదాయశాఖ 1987లో చట్టం చేస్తున్న సమయంలో ప్రతిపాదించింది. అయితే హుండీ రాబడిని తాము ఆదాయంగా చూపలేమని, అది చాలా ఎక్కువ అవుతుందని అప్పట్లో టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాతంగా కాకుండా నిర్ణీత మొత్తంగా ఏటా రూ.1.25 కోట్లు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ మొత్తాన్ని పెంచాలని 2014లో మరోసారి ప్రతిపాదించగా, ఆడిట్ విభాగం అంగీకరించడం లేదంటూ టీటీడీ పెంచలేదు. నాటి టీడీపీ ప్రభుత్వం దీనిపై ఒత్తిడి చేయలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు మారాయి. భారీ ఎత్తున నిధులు ఇవ్వడం సాధ్యం కాదని, కావాలంటే నిబంధనలు సవరించుకోవాలని ప్రభుత్వానికి టీటీడీ సూచించింది. దీంతో దేవాదాయశాఖ.. టీటీడీ నుంచి ఏటా రూ.50 కోట్లు రాబట్టేలా ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైంది. అయితే, టీటీడీ సూచించడం, ఆ వెంటనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం.. అంతా వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా జరుగుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీటీడీ.. ఇప్పటివరకు నేరుగా ప్రభుత్వానికి నిధులు ఇవ్వకపోయినా.. ఆలయాల జీర్ణోద్ధరణ, నిర్మాణాలకు ఏటా భారీగానే నిధులు ఖర్చుపెడుతోంది. అలాకాకుండా.. ఇప్పుడు దేవాదాయశాఖకే నిధులు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇదే.. పలు అనుమానాలకు తావిస్తోంది. అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ప్రభుత్వం.. ఈ నిధులను కూడా దుర్వినియోగం చేస్తుందేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019-20 బడ్జెట్ లో రూ. 234 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ‘‘2 వేల జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి రూ.30 వేలు, 5 వేల జనాభా ఉన్న పంచాయతీకి రూ.60 వేలు, 10 వేల జనాభా ఉన్న పంచాయతీకి రూ.90 వేలు, 10 వేల పైన జనాభా ఉన్న పంచాయతీకి రూ.1.2 లక్షలతో ధూపదీప నైవేద్యం కల్పించేందుకు రూ.234 కోట్లు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాం’’ అని ఘనంగా ప్రకటించింది. కానీ, ఇది ప్రకటనకే పరిమితమైంది. ఆచరణలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు టీటీడీ నుంచి రాబట్టే నిధులను అటు మళ్లించేందుకు పథక రచన చేస్తోంది. రాష్ట్రంలోని ఇతర దేవాలయాల నుంచి వసూలు చేస్తున్న నిధులు ఏమవుతున్నాయో.. ఎటు పోతున్నాయో.. ప్రభుత్వమే చెప్పాలి.