
ఆషాఢ శుద్ధ పౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. ఇదే రోజు వ్యాస మహాముని జన్మతిథి కావున, అనాది కాలం నుంచి మహా పర్వదినం గా భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడి, వ్యాస మహర్షి, దత్తాత్రేయులవారు, సాయిబాబాను పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ :
గురు పూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడు పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు ‘వేదనిధి’. ఆయన సతీమణి పేరు ‘వేదవతి’. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని ఒకనాడు వేదనిధికి తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్లతో వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.
వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు. ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యం. దానికి తమరు బ్రాహ్మణార్థం భోజనానికి మా ఇంటికి తప్పక రావాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి, వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగా నదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలు సిద్ధపరిచి శ్రాద్ధ విధులు విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.
ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసుని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణు సాయుజ్య న్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందుదుముగాక..!
సేకరణ:-పెండ్యాల రామ్