
చారిత్రక భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం.. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచీ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తేనుంది. నేటి సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ నగరంలోకి లారీలు, భారీ వాహనాల రాకను నిషేధించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు శోభాయాత్ర జరిగే రూట్లలో కాకుండా ఇతర ప్రత్యమ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు నగరవ్యాప్తంగా శోభాయాత్ర జరిగే ప్రాంతాలతో కూడిన రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. సుమారు 150 కిలోమీటర్ల మేర యాత్ర జరగనున్న నేపథ్యంలో వాహనదారులు ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం గణేశ్ నిమజ్జనానికి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. ట్యాంక్ బండ్, చార్మినార్ వంటి సున్నిత ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.
బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర .. ఫలక్ నుమా, చార్మినార్, మోండా మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపునకు చేరుకోనుంది. అలాగే, ఉప్పల్, సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు బాటా, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోనున్నాయి. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 19 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారు.
నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచే మద్యం షాపులను మూసివేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాతే తిరిగి తెరుస్తారు. అలాగే, సిటీ బస్సు ల రాకపోకలపైనా ఆంక్షలు కొనసాగనున్నాయి. పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్‌గంజ్ వరకే పరిమితం చేస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కు వరకే పరిమితమవుతాయి. భక్తుల కోసం ట్యాంక్ బండ్ వైపు నడిపే ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు కొనసాగుతాయి.