
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం విషయంలో ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి గణేశుడు మట్టితో రూపుదిద్దుకోనున్నాడు. 70 అడుగుల ఎత్తయిన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మండపంలోనే నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు 65 అడుగులకుపైగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రూపొందించిన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఉత్సవ కమిటీ.. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా గ్రేటర్ ప్రథమ పౌరురాలు గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది మట్టి గణపతిని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు అంగీకరించారని మేయర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి గణపతి ఏర్పాటుపై ఉత్సవ కమిటీ ప్రతినిధులతో ఆమె చర్చించారు. పర్యావరణం, నిమజ్జనంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎకో ఫ్రెండ్లీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. ఆమె విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించినట్టు మేయర్ కార్యాలయం తెలిపింది.
హుస్సేన్ సాగర్లో ఈ ఒక్క ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో జీహెచ్ఎంసీ పిటిషన్ దాఖలు చేసింది. నిమజ్జనానికి అనుకూలంగా హుస్సేన్ సాగర్లో 25 బేబీ పాండ్స్ కూడా నిర్మించామని కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం పీవోపీ విగ్రహాల వల్ల హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై అందులో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రసాయనాలు లేని, మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మాత్రం అనుమతినిచ్చింది.