
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం దెబ్బకు .. తెలంగాణ ప్రతిపక్షాలు చిత్తయ్యాయి. వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలు తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఆ పథకం గురించి మర్చి పోయాయని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఆ పథకంపై నానా రాద్దాంతం చేశాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌లో ఓడించడానికి, దళితులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశ పెట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఆ పథకం తొలుత హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్‌కు దళితులపై నిజంగా ప్రేమ ఉంటే, రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలని సవాల్ చేశాయి. దళిత బంధు పథకాన్ని అమలు చేయడానికి లక్ష నాగళ్లతో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను దున్నిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించగా, దళిత బంధు నిధుల కోసం సెక్రటేరియట్ భూములు అమ్మేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వీరిద్దరి సవాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. కానీ, దళిత బంధు పథకాన్ని మాత్రం అమలు చేశారు. అది కూడా ఓట్ల పథకమని ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్న హుజూరాబాద్‌లో కాదు. తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో. ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు ఈనెల 5వ తేదీ ఉదయం దళిత బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ రూ. 7.60 కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో ఆ గ్రామంలో ఆనందానికి హద్దే లేదు. సీఎం కేసీఆర్‌ను దేవుడితో పోల్చి పండగ చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు పథకానికి నిధులు మంజూరు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అప్పటి వరకు లక్ష నాగళ్లు, సచివాలయ భూముల అమ్మకం అంటూ మాట్లాడిన యువనేతలు సైతం దీనిపై ఇప్పటి వరకు మాట్లాడలేదు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న నేతల కోసం అనేక ఫిల్టర్లు చేసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను, కాంగ్రెస్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని హై కమాండ్ నియమించడం జరిగింది.
యువనేతలు పార్టీ పగ్గాలు అందుకోవడంతో ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై దాడికి దిగారు. బండి సంజయ్ కు దుబ్బాకలో బీజేపీ గెలుపు మంచి కిక్ ఇవ్వగా, రేవంత్ రెడ్డికి పార్టీ తలపెట్టిన పెట్రోల్ ధరల పెంపు నిరసనలు గుర్తింపు తెచ్చింది. పైగా, ఇద్దరు నేతలూ సీఎం కేసీఆర్‌ను తిట్టడంలో దిట్టలు. ఆ ఇద్దరు నేతలు సీఎం కేసీఆర్ ను తిట్టే తిట్లకు మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు బాధపడ్డారు. తండ్రి వయసున్న సీఎంను నోటి కొచ్చినట్లు తిట్టడం భావ్యంకాదని హితవు పలికారు. కానీ, వీరు వెనక్కు తగ్గలేదు. అయితే, వాసాలమర్రి మాత్రం వీరి నోటికి తాళం వేసిందని భావించాలి. దళిత బంధం అమలుచేసినందుకు సీఎం కేసీఆర్‌ను ప్రశంసించలేరు. దళితులకు ఆగ్రహం తెప్పించేవిధంగా ఆ పథకాన్ని వ్యతిరేకించలేరు. దీంతో వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారిందని టాక్.