
వైస్సార్ టిపి అధినేత వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ అంటే ఎవరో తెలియదు అన్నట్టు సెటైరికల్ గా మాట్లాడారు. “కేటీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ గారి కొడుకేనా ?”. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ కు మహిళల పట్ల గౌరవం లేదని, తన కొడుకు కేటీఆర్ కూడా అంతేనని షర్మిల ఫైర్ అయ్యారు. కేటీఆర్ దృష్టిలో మహిళలు వంటింట్లో వంటలు చేసుకోవాలి ? వ్రతాలు చేసుకోవాలి? అంతేనా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ఓ పెద్ద మొగో..డు కదా! మరి మహిళలకు , నిరుద్యోగులకు ఏం చేస్తున్నారు? అని గట్టిగా నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో 3.85 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని , అలా చేస్తే.. పెద్ద మొగో..డు చేసి చూపాడు అనుకుంటానని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
సీఎం అంటే సీఎం హోదా కాదని, వారు కూడా కామన్ మ్యాన్ తోనే సమానమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని అది అవునో , కాదో గ్రామాల్లో వెళ్లి అడిగి తెలుసుకోవాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేశారని…దీని వల్ల ఎంతో మంది విద్యార్థులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదని, ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేశారు. అప్పటి యుపిఎ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు పై పెట్టారన్నారు.