
‘కేజీఎఫ్’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ కొట్టిన సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కేజీఎఫ్ 2’ సినిమా రూపొందింది. ‘కేజీఎఫ్ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు కారణంగా ఈ కేజీఎఫ్2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యష్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో, సంజయ్ దత్ విలనిజం చూపించనున్నాడు. విలన్ ‘అధీరా’గా ఆయన విజృంభించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ రోజు సంజయ్ దత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన లుక్ కి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఖడ్గాన్ని భుజాన వేసుకుని ధైర్యంగా ముందుకు నడుస్తూ ఆయన ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. పోస్టర్లో ఆయన లుక్ ను బట్టే, ఆ పాత్ర ఎంత రఫ్ గా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో కొనసాగే ఈ సినిమాలో, యష్ జోడీగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది. తెలుగు నుంచి ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంకా రవీనా టాండన్ ప్రత్యేక పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.