
దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పేరిట మార్చిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం పేరు మార్పుపై భిన్న స్పందనలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై శివసేన పార్టీ ఆరోపణలు, విమర్శలు గుప్పించింది. ఈ వరుస పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం వెలువరించింది. ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరు మార్పు అంశం రాజకీయ క్రీడలో భాగమని ఆరోపించింది.ఈ మార్పు వెనుక ప్రజాభిప్రాయాలు ఏమీ లేవని పేర్కొంది. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను తక్కువ చేసి చూడడం సరికాదని బీజేపీ ప్రభుత్వానికి హితవు పలికింది.. ధ్యాన్ చంద్ ను గౌరవించాలనుకుంటే రాజీవ్ గాంధీని అవమానించాల్సిన అవసరం లేదని ఘాటుగా విమర్శించింది. క్రికెట్ క్రీడకు మోడీ ఏం చేశారని అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి తన పేరు పెట్టుకున్నారని ప్రజానీకం ప్రశ్నిస్తోందని అన్నారు. ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం తెచ్చిన జాదవ్ పేరిట ఖేల్ రత్న పేరు మార్చవచ్చు కదా? అని ప్రశ్నించింది.