
ట్రైబ్యునళ్ల ఏర్పాటు, వాటిలో సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రం ఏడాదిగా చెప్పిందే చెబుతోంది తప్ప ఆచరణపై మాత్రం శ్రద్ధ చూపడం లేదని సీజేఐ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. దేశంలోని ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయడంపై విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘గత వారం విచారణ జరిగిన సమయంలో.. తప్పక అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమైంది?’’ అని సొలిసిటర్ జనరల్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. మరో రెండు వారాలు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో.. జస్టిస్ రమణ.. ఆయన విన్నపాన్ని ఆమోదించారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి సమయం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అసలు ట్రైబ్యునళ్ల ఏర్పాటులో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. 10 రోజుల్లోగా నిర్ణయం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.