
కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం వాటా దక్కాల్సి ఉందని నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. జల సౌధలో మంగళవారం కృష్ణా బోర్డు భేటీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప సంఘం రూపొందించిన నివేదికపైనే తాజా సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని కోరుతామని చెప్పారు.
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకూ 105 టీఎంసీలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. సాగుతో పాటు విద్యుతు ప్రాజెక్టులూ తమకు కీలకమని వివరించారు. అన్ని అంశాలపై సమావేశంలో చర్చించాక, సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. నీటి కేటాయింపుల విషయం తమ పరిధిలో లేదని బోర్డు అధికారులు చెప్పడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, కేంద్రం జారీ చేసిన గెజిట్ అమలు, రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై కృష్ణా బోర్డు సమావేశం కొనసాగుతోంది. కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా.. తెలంగాణ నుంచి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, ఏపీ నుంచి జలవనరుల కార్యదర్శి శ్యామలారావు, ఈఎన్సీ నారాయణరెడ్డితోపాటు ముఖ్య అధికారులు హాజరయ్యారు.
కృష్ణా పరిధిలోని ఏడు ప్రాజెక్టులను అప్పగించడానికి తెలంగాణ అంగీకరించినా.. అక్కడ ఉన్న సిబ్బంది వివరాలను ఇప్పటిదాకా బోర్డుకు అందించలేదు. రాష్ట్ర పరిధిలోని విద్యుత్ ప్రాజెక్టులను అప్పగించాలన్న వాదనను తెలంగాణ వ్యతిరేకిస్తుండగా.. ఏపీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనా సమావేశంలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. తమకు ఉన్న అభ్యంతరాలను తెలంగాణ, ఏపీ అధికారులు వేర్వేరుగా బోర్డు ముందు ఉంచారు.