
తొలి టెస్టు జరిగి ఉంటే 150కు పైగా పరుగుల లక్ష్యాన్ని భారత్ ఈజీగానే ఛేదించి గెలిచేది. కానీ బ్యాడ్ లక్.. విజయం ముంగిటకు చేరిన భారత్ ను వరుణుడు అడ్డుకున్నాడు. చివరి రోజు వర్షంతో భారత విజయాన్ని.. ఇంగ్లండ్ అపజయాన్ని నిలిపివేశాడు. బౌలింగ్ లో అదరగొట్టిన భారత్ ఇంకా బ్యాటింగ్ లో మాత్రం గాడినపడాల్సి ఉంది. ఈనేపథ్యంలో లార్డ్స్ లో ఈరోజు రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది.
ఆతిథ్య ఇంగ్లండ్ తో భారత్ రెండో టెస్టు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. సిరీస్ లో బోణి కొట్టే అవకాశం చేజారడంతో కోహ్లీ సేన ఈసారి మరింత పట్టుదలగా ముందుకెళుతోంది. సీనియర్ బ్యాట్స్ మెన్ పూజారా, కోహ్లీ, రహానే, పంత్ లు తొలి టెస్టులో విఫలం కావడం భారత్ కు మైనస్ గా మారింది. బౌలర్లు అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక తొలి టెస్టులో పక్కనపెట్టిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
వన్ డౌన్ బ్యాట్స్ మెన్ పూజారా పేలవ ఫామ్ లో ఉన్నాడు. 9 ఇన్నింగ్స్ లలో అతడు ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. నాటింగ్ హమ్ తొలి టెస్టులోనూ విఫలమయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ సిరీస్ లో ఓపెనర్ గా రాణించడం జట్టుకు బలాన్ని ఇచ్చింది. జడేజా బ్యాట్ తో రాణించాడు. పంత్ ఇంకా మొదలుపెట్టాల్సి ఉంది.
ఇంగ్లండ్ లోని పేసర్లకు అనుకూలించే పిచ్ పై 4 సీమర్లు, 1 స్పిన్నర్ తో ఆడుతామని కోహ్లీ చెప్పడంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కు చోటు దక్కలేదు. అయితే ఈరోజు రెండో టెస్టుకు కూర్పు ఎలా ఉంటుందన్నది కీలకం. మొదటి టెస్టులో ఆడిన శార్ధుల్ ఠాకూర్ గాయపడడంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అశ్విన్ ను ఆడిస్తారా? లేదా ఇషాంత్, ఉమేశ్ యాదవ్ లలో ఒకరిని తీసుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది. పిచ్ పై పచ్చిక లేకుంటే మాత్రం అశ్విన్ ను తీసుకుంటారు.బుమ్రా, షమీ, సిరాజ్ లు సూపర్ ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం.
ఇక ఇంగ్లండ్ ను కలవరపెడుతున్నది వారి బ్యాటింగ్ సమస్యే. కొత్త బ్యాట్స్ మెన్ ఏడుగురు రాణించడం లేదు. కెప్టెన్ రూట్ మాత్రమే సెంచరీతో జట్టును రెండు ఇన్నింగ్స్ లలోనూ ఆదుకున్నాడు. ఇక భారత పేస్ ను ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఎదుర్కోవడం లేదు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గాయపడడంతో అతడి స్థానంలో మార్క్ వుడ్ నుతీసుకుంటారని తెలుస్తోంది.