
రాష్ట్రంలో ఏ బంధు పెట్టినా టీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టాలని, అన్నీ కలిసొస్తే.. త్వరలోనే బీసీ బంధు కూడా పెడతామని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించగానే.. ఏమీ చేతకానోడు కూడా ఏదేదో మాట్లాడుతున్నాడని, త్వరలోనే వాళ్ల నోళ్లు మూయిస్తామని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ పేదలు ఉన్నారని, వారిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాల్సి ఉందని తెలిపారు. ఓ పద్ధతి ప్రకారం కింది నుంచి క్రమంగా పైకి వస్తామని, ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. దీనివల్ల.. కొంచెం వెనకా ముందుగా అన్ని కులాల వాళ్లూ అభివృద్ధి చెందుతారని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో ఇన్నేళ్లలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి. కానీ, ఈ తరహా ఆలోచన ఎవరూ చేయలేదు. ఆ బంధు పెట్టినా.. ఈ బంధు పెట్టినా.. ఏ బంధు పెట్టినా మనమే పెట్టాలి. పెట్టగలుగుతాం. టైమొస్తే బీసీ బంధు పెడతాం. మైనారిటీ బంధు.. ఇతర బంధులు కూడా పెడతాం. ఈ రాష్ట్రానికి మనం తప్ప ఇంక ఎవరూ ఏమీ చేయలేరు. మరో 20 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘రైతు బంధు’ తీసుకొచ్చాం. ఒక్కో సామాజిక వర్గం ఆర్థిక పరిపుష్టికి ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాగే, దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కోసం దళిత బంధు అమలు చేస్తే తప్పేంటి? పేదరిక పిరమిడ్ లో దళితులు అట్టడుగు స్థానంలో ఉన్నారు. దేశంలో అత్యంత పేదలు దళితులే. పేదరికాన్ని నిర్మూలించాలంటే, అన్ని వర్గాల కంటే అత్యంత పేదలైన దళితుల నుంచే పని మొదలుపెట్టాలి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని, గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేలా కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సారి పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. రాష్ట్రంలో వేరే పార్టీలకు అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ‘‘దళిత బంధుతో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. దీనిపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలి. టీవీ చానళ్లలో జరిగే చర్చలు, మీడియా సమావేశాల ద్వారా పార్టీ వాణిని బలంగా వినిపించాలి. ‘దళిత బంధు’పై ప్రజలను చైతన్య పరచాలి. దీన్ని ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి’’ అని కేసీఆర్ సూచించారు.