
విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ తో పాటు వీసా ఉండాల్సిందే. కానీ ఆ దేశాల పాస్ పోర్ట్ ఉంటే 192 దేశాలకి వీసా లేకుండానే ప్రయాణం చేయవచ్చు. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్ పోర్ట్ లు ఇచ్చే దేశాల సూచీలను ‘హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్’ ప్రకటించింది.
ఈ సూచీలో జపాన్, సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిచాయి. దక్షిణ కొరియా, జర్మనీ ద్వితీయ స్థానం పొందాయి. కరోనా కారణంగా సుమారు రెండేళ్లుగా అమల్లో ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల్ని వివిధ దేశాలు సడలిస్తున్న తరుణంలో ఈ నివేదికను హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది.
ముందస్తు వీసా అవసరం లేకుండా ఒక దేశ పౌరులు ఎన్ని విదేశాలు తిరగవచ్చు అనే సంఖ్య ఆధారంగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకులను కేటాయిస్తుంది. ఈ నివేదికలో తొలి స్థానంలో ఉన్న సింగపూర్, జపాన్ ప్రజలు 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణాలు చేయవచ్చు.
భారత పాస్ పోర్టు ర్యాంకు గత ఏడాది 84 కంటే ఆరు స్థానాలు తగ్గిపోయి 90కి పరిమితమైంది. భారత్ ప్రజలు 58 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లవచ్చు. తాజా ర్యాంకుల్లో భారత్ సరసన తజికిస్థాన్, బుర్కినా ఫాసో నిలిచాయి. వరసగా మూడో ఏడాది కూడా జపాన్ తొలిస్థానంలో నిలిచింది.