
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్న గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను శంకుస్థాపన కూడా చేయనీయడం లేదని, అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులు హరిస్తోందని మండిపడ్డారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఖరిని తిప్పి కొట్టేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో మంత్రిని కూడా అడుగు పెట్టనీయబోమని హెచ్చరించారు. ఎలక్షన్లు ఎక్కడ జరిగితే అక్కడ వేల కోట్లు కుమ్మరించడం సీఎం కేసీఆర్కు అలవాటుగా మారిందని కోమటిరెడ్డి ఆరోపించారు. మునుగోడు డెవలప్మెంట్కు కూడా భారీగా నిధులు కేటాయిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయనని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల రాజగోపాల్రెడ్డి అన్న వెంకటరెడ్డి కూడా సీఎం కేసీఆర్కు ఇదే ఆఫర్ ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో సమస్యలను పరిష్కరిస్తే, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ప్రకటించారు. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లకు రూ. 1,350 కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచారని, హిట్లర్ బతికి ఉంటే, కేసీఆర్ను చూసి ఏడ్చేవాడని ఆయన ఎద్దేవా చేశారు.