
ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు (ఆర్ బీఐ) కీలక నిర్ణయం వెల్లడించింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. డబ్ల్యూఎల్ ఏ ల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది.
ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడం వల్ల ప్రజలు నగదు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్ బీఐ దృష్టికి వచ్చిందన్నారు. ఏటీఎంలలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఏ) ఆపరేటర్లకు ఆర్ బీఐ తెలిపింది. ఈ కొత్త నిబంధనలను అన్ని బ్యాంకులు సహా వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు అమలు చేయాలని ఆర్ బీఐ స్పష్టం చేసింది. కరెన్సీ లేని కారణంగా ఏటీఎం నుంచి ఖాతాదారు నగదు ఉపసంహరించుకోలేకపోయిన సమయం నుంచి నగదును తిరిగి నింపే వరకు నో క్యాష్ టైమ్ గా పరిగణిస్తామని ఆర్ బీఐ తెలిపింది.