
సామాన్యుడికి అందనంత దూరంలో వీటి ధరలు పెరిగిపోతున్నాయి. కానీ ఇంధన ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులు, మిగితా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలా రోజు రోజుకీ పెరుగుతూ సామాన్యుడిని మరిన్ని కష్టాలకు గురిచేస్తోన్న పెట్రోలు, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆందోళన చేపట్టింది. ‘చలో రాజ్‌భవన్’ పిలుపు తో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరసన మేరకు నాయకులూ, కార్యకర్తలు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. అయితే, ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించి ఎక్కడికక్కడ నేతలను అడ్డుకుంటున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద 200 మందితో సమావేశమయ్యేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
పోలీసులు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా వారి ఇళ్ల వద్దే కట్టడి చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, వారి నుంచి తప్పించుకుని వెళ్లి రాజ్‌భవన్ వద్ద నిరసన తెలిపారు. అంతేగాక, రాజ్‌భవన్ మెయిన్ గేటుకు పార్టీ జెండాలు తగిలించారు. తమ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండడం పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని కనబర్చుతోందని , ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసేందుకు పోలీసులే అనుమతి ఇచ్చారని, మళ్లీ అక్కడకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.