
పంచాయతీరాజ్ శాఖలో పాతికేళ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్ల సమస్యను సీఎం జగన్ పరిష్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 315 మంది ఎంపీడీవోలకు గత 25 ఏళ్లుగా ప్రమోషన్లు లేవు, అందువల్ల 18,500 మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు రాలేదని మంత్రి ప్రకటించారు. ఈ సమస్యపై సీఎం జగన్ స్పందించడంతో ప్రమోషన్ల సమస్యలన్నీ పరిష్కరించడం జరిగిందని ఆయన అన్నారు. పన్నెండు కేడర్లకు చెందిన 255 మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో ఇతర శాఖల నుంచి అధికారులను తీసుకు రావడం జరిగిందని, ఇప్పుడు సొంత శాఖలోని ఉద్యోగులకే ఆ అవకాశం లభించిందని ఆయన చెప్పారు. ఏ ముఖ్యమంత్రి తీసుకోని సాహసోపేత నిర్ణయం జగన్ తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇదో చరిత్రగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అమరరాజా ఫ్యాక్టరీపై స్పందించారు. ఆ ఫ్యాక్టరీ వెళ్లి పోవాలని మేం కోరుకోలేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకు లోబడి పని చేయాలని ఆయన సూచించారు. చిత్తూరు జిల్లాలో 4,5 వేల ఎకరాల భూములు అమరరాజా కంపెనీ తీసుకుందని, వాళ్లు హైకోర్టుకు కూడా వెళ్లారని ఆయన అన్నారు.