
తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పనిచేసే ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. శాశ్వత బదిలీపై వారు ఏపీ వెళ్లేందుకు అనుమతినిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి ఉద్యోగులను బదిలీపై ఆంధ్ర కి తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వానికి తెలియజేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అయితే, ఈ విషయంలో కొందరిని మాత్రం మినహాయించింది. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు, విజిలెన్స్ కేసులు పెండింగులో ఉన్న వారికి మాత్రం అవకాశం లేదని తేల్చిచెప్పింది. సచివాలయం తో పాటు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని సూచించింది. శాశ్వత బదిలీల కోసం అక్టోబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
అలాగే, ఉద్యోగి పనిచేసిన శాఖాధిపతి బదిలీకి అభ్యంతరం లేదన్న పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ సర్కారు నుంచి అనుమతి లభించిన వెంటనే సంబంధిత శాఖాధిపతుల ఉద్యోగులను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. రిలీవ్ అయినవారిని శాశ్వతంగా బదిలీ అయినట్టే పరిగణిస్తారు. వారు మళ్లీ వెనక్కి రావాలంటే మాత్రం కుదరదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బదిలీపై వెళ్లే వారికి ఎలాంటి ప్రయాణ, కరవు భత్యం లభించవు.