
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో మహిళలపై 500కు పైగా దాడులు జరిగాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా బయటకు రాగలిగినప్పుడు అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీ మహాత్ముడు ఆనాడే అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అరాచక పాలనలో పట్టపగలు ఆడపిల్ల సొంత ఇంట్లోనైనా భద్రంగా ఉండగలిగితే చాలని మహిళాలోకం భయం భయంగా బతుకుతోందని వ్యాఖ్యానించారు. చాలా కేసుల్లో నిందితులను పట్టుకోలేకపోవడం ప్రభుత్వ చేతకానితనమా లేక నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోందా అనే అనుమానాలు వస్తున్నాయని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో దళిత మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటంలేదని మండిపడ్డారు.
తనకు ప్రాణహాని ఉందని ఏకంగా సీఎం చెల్లెలు సునీతా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిందంటే.. సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డుపై రమ్య అనే బీటెక్ విద్యార్థిని దారుణ హత్య తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. రమ్య హంతకుడిని కఠినంగా శిక్షించాలని.. రాష్ట్రంలో మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించక పోవడం దారుణమన్నారు.