
ప్రజా దీవెన యాత్ర లో భాగంగా పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి, బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ మొన్నీ మధ్య అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడుతూ, త్వరలో తన పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుఉతున్నారని, తనపై రాళ్లు వేసే వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.
హుజురాబాద్ లో ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ నేతలు ఎన్ని తాయిలాలు ఇచ్చినా ప్రజలు తీసుకొంటారు కానీ ఓటు మాత్రం తనకే వేస్తానని ప్రజలు తనకు హామీ ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికే హుజురాబాద్ లో టీఆర్ఎస్ నేతలు రూ.150 కోట్లు ఖర్చు చేశారని, ఇదంతా టీఆర్ఎస్ నేతలు అక్రమంగా సంపాదించిందేనని ఆరోపించారు. కేసీఆర్ కు ప్రజల పై ప్రేమ కన్నా హుజురాబాద్ లో ఓట్ల పైనే మక్కువ ఎక్కువ ఉందని విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితులకు ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారని వారికి కూడా ఆర్థికంగా తోడ్పాటు అందించాలని, ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు.