
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను గెలిపించడానికి కేసీఆర్ వ్యూహాల్లో ప్రత్యర్థులు చిక్కుపోవాల్సిందే. పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీష్‌రావు మంత్రాంగం ఫలించి ఈటెల బంధువులు, ఆయన సొంత కులస్థులు సైతం గులాబీ జెండాకు జై కొట్టారు. ఈటెల రాజేందర్‌ను ఒంటరివాడిని చేయాలనే ఏకైక లక్ష్యంతో టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం మొదట ఈటెలతో పాటు పార్టీని వీడిన వారిని తిరిగి టీఆర్ఎస్లో చేర్చుకుంది. ఆ తర్వాత ఆయన ముఖ్య అనుచరులను కూడా తిరిగి గులాబీ గూటికి రప్పించింది.
ఉప ఎన్నికల ప్రచారం పుంజుకున్న సమయంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలకు గాలం వేశారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్కు భారీగా వలసలను ప్రోత్సహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోకి మంత్రి హరీష్‌రావు స్వయంగా రంగంలోకి దిగడంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బంధువులను, కమలాపూర్ లోని ఆయన ఇంటి చుట్టుపక్కల వారిని, ముదిరాజ్ కులస్థులను కూడా టీఆర్ఎస్లో చేర్చారు. హరీష్‌రావు సమక్షంలో మల్లాపూర్ గ్రామస్థులు సైతం గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కేసీఆర్ సర్కార్ పన్నిన ముప్పేట వ్యూహం ఫలించి ఈటెల ఒంటరి వాడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.