
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన తమ్ముడు శ్రీకాంత్ తో తమకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు ఆరోపించారు. వీరి వేధింపులు ఆగకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ పై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్ హెచ్ ఆర్ సీ)కు క్రిస్టియన్ పల్లికి చెందిన బండేకర్ విశ్వనాథరావు, పుష్పలత దంపతులు బుధవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల సమయంలో నమోదైన ఓ కేసులో తాను సాక్షిగా ఉన్నానని, అప్పటి నుంచి మంత్రి, ఆయన సోదరుడు తమను వేధింపుల పాలు చేస్తున్నారని ఆరోపించారు.
తమపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు, ప్రైవేట్ సంస్థల్లో పని చేసుకుంటున్న తనకు, తన భార్యకు ఉద్యోగాలు లేకుండా చేసేశారని, తీసేయించారని వాపోయారు. స్థానిక సీఐ మహేశ్వర్ గౌడ్ తో అర్ధరాత్రి సమయంలో తమ ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతుకు గురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. తమపై వేధింపులు ఆపకపోతే మంత్రి, ఆయన తమ్ముడి పేర్లతో లేఖ రాసి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని ఎస్ హెచ్ ఆర్ సీ కి ఇచ్చిన ఫిర్యాదులో హెచ్చరించారు.