
పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన నివేదిక వైరల్ అవుతోంది. ఏపీ లోక్‌సభ ఎంపీల పనితీరు, పార్లమెంటుకు హాజరుకు సంబంధించిన అంశాలపై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. పార్లమెంట్ అఫిషియల్ సమాచారం ప్రకారం వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణరాజు టాప్‌లో ఉండగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ తమ్ముడు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి లాస్ట్‌లో ఉన్నారు. ఎంపీ రఘురాజు అటెండెన్స్ 96శాతం, పాల్గొన్న డిబేట్స్ 50, అడిగిన ప్రశ్నలు 145 ఉన్నాయి. సెకండ్ ప్లేస్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. హాజరు 89%, డిబేట్స్ 54, ప్రశ్నలు 133 అడిగారు. మూడో స్థానంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. ఆయన 89% అటెండెన్స్, 14 డిబేట్స్, 77 ప్రశ్నలు అడిగారు. డిబేట్ల విషయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 54, రఘురామ 50, రామ్మోహన్నాయుడు 49లతో మూడు స్థానాల్లో ఉండగా, ప్రశ్నల విషయంలో కాకినాడ ఎంపీ వంగా గీత 173, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 162, నర్సాపురం ఎంపీ రఘురామ 145 ప్రశ్నలు అడిగారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఒకే ఒక్క ప్రశ్న కూడా అడగలేదని రిపోర్ట్‌లో తెలిపింది. పార్లమెంటుకు హాజరు, డిబేట్ల విషయంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన అటెండెన్స్ 32 శాతం ఉండగా, కేవలం ఒక్క డిబేట్లో మాత్రమే పాల్గొన్నారు. ప్రశ్నలు మాత్రం 146 అడగడం విశేషం.