
కోమటిరెడ్డి సోదరులపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. వాళ్లు ఆంధ్రోళ్ల బానిసలని, వాళ్ల బాసులనే తరిమికొట్టినా.. వీళ్లు మాత్రం ఇంకా ఊడిగం చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. వాళ్ల నోటికి భయపడడానికి తాము కాంగ్రెస్ నాయకులం కామన్నారు. తన కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిందిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడులో బుధవారం రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి పిలుపునందుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మునుగోడు చేరుకున్నారు. అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు.. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులను మాత్రమే అనుమతించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం.. టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి.. కోమటిరెడ్డి సోదరులపై నిప్పులు చెరిగారు. ‘‘2004 వరకు వాళ్ల బతుకులేందో మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా తయారైందో కూడా చూస్తున్నాం. ఎక్కువ మాట్లాడితే.. వాళ్ల బట్టలు విప్పి.. వాళ్ల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తా. ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు అని హెచ్చరించినా.. రాజగోపాల్ రెడ్డి వినడం లేదు. మళ్లీ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికాడు. 10వేల మందిని తెస్తా.. అడ్డం వస్తా.. అని బీరాలు పలికాడు. పది మందిని తెచ్చే దమ్ములేదు. మీ నోటికి భయపడడానికి నేనేమీ జానారెడ్డినో, ఉత్తమ్ కుమార్ రెడ్డినో కాను. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడండి. ఈ సోదరులిద్దరూ ఈ జిల్లాను వైఎస్ఆర్ కు అమ్మేసిండ్రు. జిల్లా ఓట్లను రాజశేఖర్ రెడ్డికి తాకట్టు పెట్టిండ్రు. కృష్ణానది నీళ్లలో కూడా నల్లగొండ జిల్లా వాటాను వైఎస్ కు అమ్ముకొని పైసలు సంపాదించిన దొంగలు వీళ్లు. ఈ జిల్లా రైతుల ఉసురు తీసింది ఈ ఇద్దరు అన్నదమ్ములే’’ అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గానికే రాకుండా ప్రొటోకాల్ పేరుతో రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.