
ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల పాటు క్రీడాభిమానులను అలరించిన టోక్యో ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. టోక్యో ఒలింపిక్స్ ను జపాన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి 10 మంది అథ్లెట్లు, అధికారులు హాజరయ్యారు. 1964 తర్వాత రెండోసారి ఒలింపిక్స్ నిర్వహించిన జపాన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా క్రీడలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంది. విశ్వక్రీడలను నిలిపేయాలంటూ అక్కడి ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చిన క్రమంలో కరోనా ఛాయలు లేకుండా పోటీలను నిర్వాహకులు విజయవంతంగా ముగించారు. ముగింపు వేడుకల్లో విద్యుత్ కాంతుల ప్రదర్శన అలరించింది. అన్ని దేశాల ఆటగాళ్లు.. తమ జాతీయ జెండాలను ప్రదర్శించారు. జులై 23న ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్.. ఆగస్టు 8 వరకు జరిగాయి. టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానం సాధించగా… చైనా, జపాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏడు పతకాలు సాధించిన భారత్ 48వ స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ముగింపు పలికింది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా గెలిచి స్వర్ణాన్ని ముద్దాడాడు. దీంతో భారత పతకాల సంఖ్య ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో ఏడుకు చేరింది.
ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం టోక్యో స్టేడియంలో నిర్వహించిన విద్యుత్ కాంతుల ప్రదర్శన అలరించింది. జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, అంతర్జాతీయ ఒలింపిక్స్ అధ్యక్షుడు థామస్ బాక్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టోక్యో నగరంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్నా.. ఒలింపిక్స్ పై ఎలాంటి ప్రభావం పడలేదు! ఆగస్టు 5న అత్యధికంగా 5 వేలకుపైగా కేసులు నమోదైనా.. ఒలింపిక్ గ్రామంపై దాని ప్రభావం పడలేదు. ప్రపంచం కరోనాతో కొట్టుమిట్టాడుతున్న క్లిష్ట పరిస్థితుల్లోనూ జపాన్ ప్రభుత్వం విజయవంతంగా విశ్వక్రీడలను నిర్వహించింది. క్రీడాకారులు వైరస్ బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఇంత పెద్ద ఈవెంట్ ను జపాన్ విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది.
టోక్యో ఒలింపిక్స్ నిర్విరామంగా కొనసాగేందుకు వీలుగా.. ఒలింపిక్ గ్రామంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం సహా స్టేడియాల్లోకి ఇతరులతో పాటు ప్రేక్షకులనూ అనుమతించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్రామానికీ, టోక్యో నగరానికీ ఎలాంటి సంబంధం లేదనే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. క్రీడాకారులు వినియోగించిన వస్తువులను, ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేశారు. ఇలా అనేక ప్రత్యేక జాగ్రత్తలు వహించి.. వైరస్ ను ఒలింపిక్ గ్రామంలోకి రాకుండా జపాన్ ప్రభుత్వం విజయవంతంగా నియంత్రించింది.