
ఏపీలోని అమరరాజా బ్యాటరీ సంస్థ తమ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రభుత్వ తీరు వల్లే సంస్థ తరలిపోతోందని అన్నారు. కాలుష్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలే తప్ప, ఇలా పరిశ్రమను వెళ్లగొట్టడం తగదని హితవు పలికారు. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర రాజా సంస్థను ఇబ్బందిపెట్టాలని ఏపీ ప్రభుత్వం చూసిందనే విమర్శలు తలెత్తాయి. తమ ఫ్యాక్టరీని తమిళనాడుకు తరలించాలనే నిర్ణయం తీసుకున్న ‘అమరరాజా’.. ఏపీ ప్రభుత్వానికే రివర్స్ షాక్ ఇచ్చిందనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఇప్పటికే ఇక్కడ ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుండటంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.