
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు విశాఖలో బాక్సైట్ మైనింగ్ తో వేలాది కోట్లు దోచుకుంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి స్కామ్ లు చేసే స్కీమ్ లకు నిధులు మళ్లించారని ధ్వజమెత్తారు. టీడీఎల్పీ, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షనర్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు భయపడి పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశారన్న చంద్రబాబు… రూ.2 లక్షల కోట్ల సంపదను నిరుపయోగ ఆస్తిగా మార్చారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో భారీగా రేషన్ కార్డులు, పింఛన్లలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు ఆర్ అండ్ బి విభాగానికి అప్పగించడాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. త్వరలోనే వైసీపీ అరాచకాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.