
75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిల భారాన్నికూడా చిరునవ్వుతో మోశామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ధాన్యం బకాయిలు రూ. 960 కోట్లు, ఉచిత విద్యుత్ బకాయిలు రూ.9 వేల కోట్లు, రూ. 324 కోట్ల విత్తన బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. రైతులకు ఏ సీజన్లో జరిగే నష్టానికి ఆ సీజన్లోనే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో సీఎం పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించి వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల గురించి తెలిపారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసానిచ్చారు.