
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలతో ముంచెత్తారు. దళితబంధు వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, అంత సాహసం చేసింది కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. రాబోయే కాలం అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ నిలుస్తారని, ప్రజల కోసం బతికే నాయకుడు ఆయన అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తన సొంత నియోజకవర్గమైన ఆలేరులోని వాసాలమర్రిలో ‘దళితబంధు’ అమలు చేస్తుండడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని చెప్పారు. వాసాలమర్రి దళితుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
ఇంత కాలం అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశారు గానీ, వారి ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదని అన్నారు. ‘దళితబంధు’ను ఎలా ఆపాలా అని చాలా మంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగలవా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావించారు. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కు దళితులు ఎవ్వరూ ఓటెయ్యరని, దళితుల భూములు ఆక్రమించుకున్న ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.