
బంగాళా దుంప ఆహారంగానే కాదు, అందాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను బంగాళాదుంప తొలగిస్తుంది. బంగాళాదుంప రసంలో దూదిని ముంచి, దాన్ని కళ్లపై 15 నిమిషాలు ఉంచాలి. ఇలా రోజూ చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి. దుంప రసంతో రోజూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయి. ఎండకు చర్మం కమిలిపోయినా, ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడినా బంగాళాదుంప రసం రాస్తే చర్మం మళ్లీ సాధారణ స్థితికి చేరుతుంది.
చర్మం మిలమిలా మెరిసిపోవాలంటే బంగాళదుంపకు ముల్తానీ మట్టి తోడు కావాల్సిందే. ఒక స్పూను బంగాళాదుంప రసంలో.. మరో స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని అరగంట ఆరనీయండి. గోరువెచ్చటి నీటితో ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత చన్నీటితో ముఖం కడగండి. మీ ముఖం ఫ్రెష్‌గా కనిపించడమే కాకుండా మిలమిలా మెరిసిపోతుంది. చర్మం ఛాయను పెంచేందుకు మరో చిట్కా కూడా ఉంది. దుంపను ఉడకబెట్టి ముద్దలా చేసి, ఒక స్పూను పాల పొడి, ఒక స్పూను బాదం నూనె కలిపి ముఖానికి పట్టించండి. పావుగంట ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఛాయ పెరుగుతుంది.
బంగాళ దుంప చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇందుకు మీరు ఒక దుంపను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయండి. ఆ తర్వాత దాన్ని ముఖానికి రాసుకోండి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. చర్మం మృదువుగా మారి, ఛాయ కూడా పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది. బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేస్తే చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.