
ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తులు సంపాదించుకుంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఒక్కొక్కరు రూ.100 కోట్లపైనే ఆస్తులు కలిగి ఉంటున్నారని అన్నారు. జగన్ పాలనలో సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందడం లేదని విమర్శించారు. సీఎం పీఠం ఎక్కే ముందు వరకూ ఎన్నో మాటలు చెప్పిన జగన్.. ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఏలూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏది దొరికితే అది ఊడ్చుకుపోదామని చూస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి, దొరికింది దోచుకోవాలనుకుంటే ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారని నాదెండ్ల హెచ్చరించారు. వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లు చేయటం… వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయే వరకూ చేస్తున్న తీరు గురించి… వారు చెబుతుంటే బాధ కలిగిస్తుందన్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాల విషయంలో ఎవరిని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లు గడిచినా జగన్ నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు.